సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దిశ ఘటనపై మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టాల అమలుకు సంబంధించిన బిల్లును బుధవారం ప్రవేశపెడతామని ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని తీసుకువస్తానంటూ సీఎం జగన్ సభలో మాట్లాడారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రత విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని జగన్ నిర్ణయం తీసుకోవడం మహిళలపై జగన్ కు ఉన్న గౌరవం తెలుస్తుందని అన్నారు. అయితే ఏపీ తరహా చట్టాల్ని తెలంగాణలో కూడా తీసుకురావాలన్నారు.
ఇటీవల హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ పై జరిగిన దాడితో యావత్తు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏపీ అసెంబ్లీ లో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదన చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని అభినందిస్తున్నానని తెలిపారు. మహిళలకు అన్యాయం జరిగిన కేసుల్లో రెండు వారాల్లో శిక్ష పడేలా చట్టం తీసుకువస్తామని జగన్ అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు రాజకీయనాయకులు అందరూ స్వాగతిస్తున్నారు. ఈ చట్టం అమలైనట్లైతే దేశంలోనే ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది.