పార్లమెంట్ లో అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణబిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లుపై చర్చ దాదాపు 8 గంటలపాటు జరిగింది. బిల్లు పాస్ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే కేరళలో ముస్లిం లీగ్‌లతో మహారాష్ట్రలో హిందూ పార్టీ ఐన శివసేనతో జత కట్టిందన్నారు. లోక్‌సభలో బిల్లును ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు మంచి వాతావరణంలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లు పాస్ కావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. చర్చలో పాల్గొన్న ఎంపీలకు పార్టీలకు మద్దతు తెలిపిన వారికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో ఉన్న మానవత విలువలకు పురాతనమైన విశ్వాసాలకు అనుగుణంగా ఉందని మోడీ ట్వీట్ లో తెలియజేసారు. ఇక బిల్లులోని ప్రతి అంశాన్ని ఎంతో సహనంతో సభకు వివరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని ప్రశంసించారు.
పౌరసత్వ సవరణ బిల్లు 2019 ప్రకారం పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి డిసెంబర్ 31, 2014లోపు భారత్‌కు వచ్చిన ముస్లింయేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఇక లోక్‌సభలో బిల్లు పాస్ కావడంతో రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక బిల్లును టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. మత ప్రాతిపదికన భారత పౌరసత్వాన్ని నిర్ణయించడమే నని విమర్శించారు. రాజ్యాంగంలోని చాలా ప్రొవిజన్లను బిల్లు ఉల్లంఘించేలా ఉందని మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఇక బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బీజేపీ కి సంపూర్ణ మద్దతు ఉండటంతో పౌరసత్వ సవరణబిల్లు సులువుగా ఆమోదం పొందినది. ఇక రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందినట్లైతే రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా పొందుపరచబడుతుంది.