ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో మండల ప్రణాళిక, గణాంక అధికారుల మూడు వారాల శిక్షణ తరగతులను వినోద్ కుమార్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచిస్తారని, ఇదే ప్రణాళికకు బాట వేస్తుందని ఆయన అన్నారు. సూక్ష్మంగా పరిశీలించి, విశ్లేషించడంతోపాటు సీఎం కేసీఆర్ విస్తృత చర్చలతో నిర్ణయం తీసుకుంటారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏదైనా విషయాన్ని చేపడితే దాన్ని జల్లెడ పడతారని, తద్వారా పక్కా ఫలితాన్ని రాబడతారని ఆయన వివరించారు.
ఇదే తరహా పద్దతిని మండల ప్రణాళికా అధికారులు అవలంభించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మండల ప్రణాళిక అధికారులు రాష్ట్ర పునాదినిని నిర్మించే వ్యక్తులని, ప్రభుత్వ నిర్ణయాలలో వారి పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రణాళిక డిపార్ట్మెంట్ అధికారులు కొత్త ఒరవడితో చేయాలని, గణాంకాలను పక్కాగా సేకరించాలనివినోద్ కుమార్ సూచించారు. తెలంగాణ స్పృహతో విధులు నిర్వహించాలని, శిక్షణ తరగతులతో సంపూర్ణ అవగాహనతో క్షేత్ర స్థాయికి చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు.
మండల ప్రణాళిక అధికారులు ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలతో మమేకం కావాలని వినోద్ కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న ఉద్యమ నాయకులు అని, అందు వల్లే తెలంగాణ రాష్ట్రం విద్యుత్, నీటి పారుదల రంగాలతోపాటు అనేక విషయాల్లో దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని ఆయన వివరించారు. అమెరికాలో కరెంటు పోదని చెప్పడం విన్నాం.. కానీ ఇప్పుడు తెలంగాణలోనూ కరెంటు పోవడం లేదన్న వాస్తవాన్ని కళ్లారా చూస్తున్నాం అని వినోద్ కుమార్ అన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడికి సమాజాన్ని గొప్పగా అవగాహన చేసుకునే నైపుణ్యం ఉంటుందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, రాష్ట్రం సిద్దించిన తర్వాత ఆ నినాదాలు నిజం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన చెప్పారు. ఒకవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరుపుతూ, మరోవైపు ఆయా శాఖల ద్వారా కూడా నియామకాలు వేగంగా జరిపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని వినోద్ కుమార్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 200 కిలోమీటర్ల మేరకు జలాలను తీసుకెళ్లామని, త్వరలోనే దుమ్ముగూడెం నుంచి మరో 60 కిలోమీటర్ల మేరకు నీళ్లను తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అధికారుల సంఖ్యతోనే ఈ ఘన ఫలితాలు సాధించామని, అప్పుడు సాధ్యం కాని పని తెలంగాణ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుందని అన్నారు.