ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న వీరిద్దరి మధ్య నిండు అసెంబ్లీలో ఆప్యాయత వెల్లివిరియడం ఇరు పార్టీల నేతలను విస్మయపరిచింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం జగన్‌తో పాటు, మంత్రులు, చీఫ్ విప్‌లు, టీడీపీ శాసనసభా పక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కాగా ఇటీవల ఓ కారుప్రమాదంలో అచ్చెన్నాయుడి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీఏసీ సమావేశేంలో సీఎం జగన్ స్వయంగా అచ్చెన్నాయుడు దగ్గరకు వచ్చి పలుకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. జరిగిన ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అచ్చెన్నాయుడి చేతికి అయిన గాయం చూసి తగ్గిందా అని పరామార్శించారు. ఇరు నేతల మధ్య జరుగుతున్న సంభాషణ నేపథ్యంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కలుగజేసుకుని మీ గురించి మా సీఎం జగన్ ఎంత ప్రేమగా అడిగారో చూడండి అంటూ అచ్చెంతో అన్నారు. గడికోట మాటలకు అచ్చెన్న స్పందిస్తూ..మీదో పార్టీ..మాదో పార్టీ..అనే దూరమే మినహా వ్యక్తిగతంగా కోపమేముంటుంది అని సమాధానం ఇచ్చారు. కేవలం రాజకీయ వైరమే తప్ప..టీడీపీ నేతలపై వ్యక్తిగతంగా కోపం ఏముండదని…అచ్చెంను పలకరించడం ద్వారా సీఎం జగన్ మరోసారి నిరూపించారు. మొత్తంగా బీఏసీ సమావేశంలో సీఎం జగన్, అచ్చెంల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత నేతలందరిని కట్టిపడేసింది.
