భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమావ గలవని, దాని కోసం ఏఎఫ్‌ఐ ముందుడుగేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(జావెలిన్ త్రో) స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్‌ఐ తమ అధికారిక ట్విటర్‌లో స్పందించింది.
‘పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌కు కంగ్రాట్స్. దక్షిణాసియా గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం నిజంగా అభినందనీయం. దశాబ్దాల తర్వాత నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి పాకిస్తాన్ అథ్లెట్‌గా అర్షద్ రికార్డు నెలకొల్పాడు’అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా భారత జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో అర్షద్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని కేవలం క్రీడల మాత్రమే తొలగించగలవు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. ‘రెండు దేశాల మధ్య సయోధ్య, సత్సంబంధాలు తిరిగి పునరుద్దరించుకోవాలంటే కేవలం క్రీడలు మాత్రమే ఉపయోగపడతాయి’అంటూ మరికొంత మంది ట్వీట్ చేశారు. ఇక ముంబై దాడుల అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య తిరిగి శత్రుత్వం తారాస్థాయికి చేరగా.. పుల్వామా టెర్రర్ అటాక్ అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన విషయం తెలిసిందే.