నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైసీపీ భగవద్గీత, బైబుల్, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్‌రావు ఆ పార్టీని వీడారు. ఈయనతో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలు కూడ వైసీపీలో చేరారు. వారందరికి సీఎం జగన్ పార్టీ కండువా వేశారు.