ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు 5 దశలలో నవెంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసినదే. దీనిలో భాగంగా గతనెల 30న మొదటి దశ ఎన్నికలలో భాగంగా 13 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగ్గా 62% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
రెండో విడత పోలింగ్లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 260 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 47లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఎన్నికల నేపథ్యంలో 42 వేల మందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంరభమైన పోలింగ్ 18 నియోజకవర్గాల్లో సాయంత్రం 3 గంటల వరకు, మరో రెండు చోట్ల సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది.
రెండో విడత ఎన్నికలలో భాగంగా
ముఖ్యమంత్రి రఘువర్ దాస్, శాసనసభ స్పీకర్ దినేష్ ఓరాన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా వంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. రఘుబర్ దాస్ జమ్‌షేడ్‌పూర్ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చివరి విడత ఈనెల 20న జరగనుంది. ఈనెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలలో ఎక్కడా రిగ్గింగ్, వాగ్వాదాలు, ఘర్షణలకు తావులేకుండా సజావుగా జరుపుతామని అధికారులు తెలియజేశారు.
