రాజస్థాన్‌లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు దిశ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా దుమారం రేగడం, రేపిస్టులకు ఉరి వెయ్యాలని అందరూ కోరుతుండటంతో… తాజాగా ఎన్‌కౌంటర్ జరగడంతో… ఆయన స్పందించారు. రేపిస్టులపై దయ అవసరం లేదన్నారు. తద్వారా క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష జరపాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చెయ్యడం మంచి విషయమే. ముఖ్యంగా దిశ కేసులో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రాష్ట్రపతి వ్యాఖ్యలు కాస్త బలం ఇచ్చినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా ఈ దేశంలో క్షమాభిక్ష పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఇప్పటికే చాలా హత్య కేసులు, అత్యాచారం కేసుల్లో కోర్టులు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ శిక్ష అమలవ్వట్లేదు. కారణం ఆ దోషులు… రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకుంటున్నారు. ఇలా దాదాపు 20 ఏళ్లకు పైగా క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వాటిపై రాష్ట్రపతి పదవిలో ఉన్న వారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఆ పిటిషన్లపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా… మౌనంగా ఉంటున్నారు. ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం… అలాంటి కొన్ని కేసుల్లో క్షమాభిక్ష పిటిషన్లను రద్దు చేసి… ఉరి వేసేయమని కేంద్రానికి సిఫార్స్ చేశారు