రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సేకరించే గణాంకాల వివరాలు పక్కాగా, పకడ్బందీగా ఉండాలని, ఈ డేటా ప్రతి ఒక్కరికీ కరదీపికగా ఉపయోగపడేలా రూపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. గురువారం ఖైరతాబాద్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుంచి సేకరించే అన్ని శాఖల గణాంకాలు ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రతి ఏడాది అసెంబ్లీ సమావేశాలకు ముందు స్టాటిస్టికల్ బుక్ రూపొందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈసారి స్టాటిస్టికల్ 2020 ఇయర్ బుక్ ప్రభుత్వం చేపట్టే ఆయా కార్యక్రమాలకు దిక్సూచిగా ఉండేలా సిద్ధం చేయాలని వినోద్ కుమార్ సూచించారు.అధికారులు అప్రమత్తంగా ఉండి సమగ్ర డేటాను సేకరించాలని ఆయన అన్నారు. సూక్ష్మంగా పరిశీలించి, లోతైన విశ్లేషణతో, సంపూర్ణ అవగాహనతో సీఎం కేసీఆర్ పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యమ నేతగా అనేక అంశాలపై పరిశోధన చేసి, అపారమైన విషయ పరిజ్ఞానంతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో స్టాటిస్టికల్ 2020 ఇయర్ బుక్ సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో 10,854 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 12,751 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. 33 జిల్లాలు, 141 మున్సిపాలిటీలతోపాటు 32 ప్రభుత్వ శాఖలు, 210 హెచ్ ఓ డీ విభాగాల డేటా పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు మాట్లాడుతూ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమగ్రమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
