తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని సెంట్రల్ యూరోప్ దేశాల జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. గురువారం నాడు పోలాండ్,చెక్,హంగేరీ, క్రోషియా, రొమేనియా, బల్గేరియన్ సీనియర్ జర్నలిస్టులు,ఎడిటర్ ల బృందం రెండవ రోజు జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్,ఐయస్బి లను సందర్శించారు. తొలుత జర్నలిస్టుల బృందం జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ను పరిశీలించింది. ఏరోస్పేస్ సెంటర్ లో విమానాలకు చెందిన వివిధ విభాగాలను,వాటి పనితీరును ఏరోస్పేస్ సీఇఓ కిషోర్ వివరించారు.
అనంతరం జర్నలిస్టుల బృందం గచ్చిబౌలి లోని టీ – హబ్ ను సందర్శించింది. టీహబ్ ప్రతినిధి గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం తో టీ హబ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. టీ హబ్ లో ప్రస్తుతం 175 స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, 600 స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలకు సరిపోయే విధంగా టీ హబ్ లో సదుపాయలు కలవని తెలిపారు. నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహా పలు నూతన పోకడలపై టీ హబ్‌లో జరుగుతున్న ఆవిష్కరణలు గొప్ప మలుపునకు శ్రీకారం చుడుతాయని తెలిపారు. గొప్ప ఆవిష్కరణలకు వేదికగా టీ హబ్ నిలిచిందని అన్నారు. టీ హబ్ విజయవంతం కావడంతో టి హబ్ రెండవ దశను త్వరలోనే ప్రారంభించడానికి అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్ ను సందర్శించారు. ఐయస్బి డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఐయస్బి లో అన్ని దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ చదివే విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. బిసినెస్ విద్య ను అభ్యసిస్తున్న విద్యార్థులకు 48 వేల డాలర్లు ఫిజును నిర్ణయించామని, ఈ ఫీజులోనే విద్యార్థులకు వసతి సౌకర్యంతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ఐఎస్బి విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగారని, ఇది ఐఎస్బికి ఒక గర్వకారణమని అన్నారు.