బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు.
అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు. అందుకే వారికి కోకాపేటలో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను కేటాయించారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బీసీ కులాలకు 80 ఎకరాలభూమిని కే టాయించిందన్నారు. నిర్మాణాలకు మరో 80 కోట్ల నిధులను కూడా కేటాయించిందన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హెచ్‌ఎండిఎ పరిధిలోని సుమారు రెండు మూడు వేల కోట్ల రూపాయల విలువగల భూమిని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం ఇవ్వడం గర్వకారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు 80శాతం ఉన్న బీసీ వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగా చూశారు తప్ప ఏ ఒక్క కులానికి గజం భూమిని కేటాయించలేదన్నారు. బీసీలకు గత ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే కానీ చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలోని 13 కుల సంఘాల కోటాపేటలో కేటాయించిన స్థలాలను త్వరలోనే కుల సంఘాలకు అందజేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దసంఖ్యలో బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు