అమిత్‌షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్‌షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్ షా చెప్పి ఉంటారని, అందుకే ఇప్పుడు అమిత్ షా కరెక్ట్ అని పవన్ అంటున్నాడని నాని ఎద్దేవా చేశారు. అయినా ఇప్పుడు ప్రధాని మోదీ, అమిత్‌షాలను పొగిడితే జైలుకు వెళ్లరని, అందుకే చంద్రబాబు ఈమధ్య వారిద్దరిని తెగ పొగిడేస్తున్నాడని నాని పంచ్ వేశారు. ఇక చంద్రబాబు దగ్గర తీసుకున్న రెమ్యునరేషన్‌కు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే టీడీపీని, బీజేపీతో పొత్తు కలిపేందుకు నానా తంటాలు పడుతున్నాడని..నాని ధ్వజమెత్తారు. సినిమాల్లో నిర్మాతకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇస్తే.. రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుకి ఇస్తారని అన్నారు. కేవలం నీకు రెమ్యూనరేషన్ ఇచ్చి, కాల్‌షీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని మాత్రమే పొగుడుతావని నాని దుయ్యబట్టారు. పూటకో మాట మాట్లాడటం పవన్‌కి అలవాటుగా మారిందని, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ మతానికి దగ్గరగా పెరిగానని, అందుకే ప్రజాసేవ చేయడానికి వచ్చానని చెప్పుకునే పవన్ ఇప్పుడు హిందూ మతంపై విషం చిమ్ముతున్నాడంటూ మంత్రి నాని మండిపడ్డారు. తాను మధ్యతరగతికి చెందిన ఓ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే పవన్ మాటలపై మంత్రి స్పందించారు. అసలు పవన్ కల్యాణ్ మధ్య తరగతికి చెందినవాడు ఎలా అవుతారు.. చిరంజీవి దయవల్ల సినిమాల్లోకి వచ్చి కనీసం ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని పవన్ వ్యక్తిత్వం ఏంటని ప్రశ్నించారు. ఇక దిశ అమానుషకాండలో నిందితులను బెత్తంతో దండించండి కాని..చంపే హక్కు లేదంటూ..పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి నాని ఫైర్ అయ్యారు. మంత్రుల మాటల వల్లే ‘దిశ’ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పవన్ చెప్పటంతో ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్ధం కావటం లేదని నాని విమర్శించారు. ‘నాకు కుదరకే మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది’ అని చెబుతున్న పవన్‌కు మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని నాని ప్రశ్నించారు. ‘అవసరమైతే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి’ అని చెప్పడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని.. స్త్రీ జాతిని పవన్ కల్యాణ్ అవమానపరుస్తున్నారని మంత్రి నాని విరుచుపడ్డారు. పవన్‌ను తాము అసలు రాజకీయ నాయకుడిగానే గుర్తించటం లేదంటూ మంత్రి నాని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మొత్తంగా పవన్ కల్యాణ్ పూటకో తీరుగా మాట్లాడుతూ తనకు తానే పరువు తీసుకుంటున్నాడనే చెప్పాలి.
