టిఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతీనెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బుధవారం వికారాబాద్ బస్టాండ్ కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్టాండులో మంచినీటి కొరత లేకుండా చూడాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు. బస్టాండ్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి హరితహారం మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం ఆర్టీసి బస్సులో వికారాబాద్ నుండి హైదరాబాద్ అసెంబ్లీ వరకు ప్రయాణిస్తూ ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ప్రయాణం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆర్టీసి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నదని, ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ఉద్యోగులతోపాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల పైన కూడా ఉందని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు.
