ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ బీజేపీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు దేశమంతటా తిరిగి మోదీని దింపేస్తా అంటూ చరంకెలు వేశాడు. నాకు భార్య, కొడుకు, మనవడు ఉన్నాడు.. పెళ్లాన్ని వదిలేసిన మోదీ పరిస్థితి ఏంటీ అంటూ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు..ఇక బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ అయితే ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారని నాడు చెప్పిన మోదీ.. చనిపోయిన తల్లిపై కప్పే వస్త్రం ఏదైతేనేం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు పార్టనర్లు మళ్లీ మోదీ పంచన చేరేందుకు ముసుగులు తీస్తున్నారు. చంద్రబాబు తన నలుగురు ఎంపీలను బీజేపీలో కలిపేసి మోదీతో సఖ్యత కోసం రాయబారం చేస్తుండగా, పవన్ మాత్రం మోదీ, అమిత్‌షాలే ఈ దేశానికి కరెక్ట్, ఎన్నికలకు ముందు బీజేపీ విధానాలను వ్యతిరేకించాం కాని.. పార్టీని, నాయకులను కాదు అంటూ బిస్కెట్ వేస్తున్నాడు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని, ఎప్పుడూ కలిసే ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ అధికారంలోకి వస్తుందా అని పవన్ ప్రశ్నించాడు. దీన్ని బట్టి ఈ ఇద్దరు పార్టనర్లు మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు బలపడుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు కూడా పవన్ కల్యాణ్ బీజేపీపై చేసిన కామెంట్లకు వత్తాసు పలికాడు. బీజేపీపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు అతని వ్యక్తిగత అభిప్రాయమని అచ్చెం చెప్పుకొచ్చాడు. పవనే కాదు చాలా మంది బీజేపీ – టీడీపీ, జనసేన గత ఎన్నికల్లో కలిసి పని చేసినట్లయితే ఫలితం ఎలా ఉండేది అనేదానిపై చర్చిస్తున్నారని అచ్చెం అన్నాడు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటూ..అచ్చం బాబుగారిలాగే జోకులు వేశాడు. బీజేపీకి జనసేన వ్యతిరేకం కాదు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని మీడియా ప్రతినిధులు గుర్తుచేస్తే.. జనసేన మాత్రమే కాదు..టీడీపీ కూడా బీజేపీకి వ్యతిరేకం కాదని అచ్చెంనాయుడు స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌షాలతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారటూ..అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజేపీపై పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసుల భయంతో చంద్రబాబు, రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్ మళ్లీ మోదీ పంచన చేరేందుకు నానా పాట్లు పడుతున్నారని..అందుకే ఈ మధ్య తెగ పొగిడేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఎంతగా అర్రులు చాస్తున్నాయో పవన్, అచ్చెన్నాయుడుల కామెంట్లను చూస్తే క్లియర్‌గా అర్థమవుతోంది.
