జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు. ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన అన్నారు. బిజెపి, జనసేన, టిడిపి కలిసి ఉంటే వైసిపి అధికారంలోకి వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. స్థానికులకే డెబ్బైఐదు శాతం ఉద్యోగాలు అంటే పరిశ్రమలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. కియా కంపెనీ సిఇఓని వైసిపి నేతలు బెదిరించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తారంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ ప్రకటన ఊతమిస్తోంది. రాష్ట్రానికి అన్యాయం చేసింది బిజెపి అంటూ వేదికలపై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితోనే కలిసి ఉన్నామంటూ చేస్తున్న ప్రకటన పట్ల సగటు జనసేన కార్యకర్తలు విస్తుపోతున్నారు.