అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం తన నివాసంలో కలిసిన యునైటెడ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీ ( యుసిసిసి ) ప్రతినిధులతో వినోద్ కుమార్ సమావేశమయ్యారు. క్రిస్టియన్ లకు జెరూసలేం పవిత్ర యాత్ర కు వెళ్లేందుకు ప్రభుత్వ పరంగా రాయితీ ఇప్పించాలని యూసిసిసి ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సమాజంలో చదువు వజ్రాయుధం అని, దాని ప్రాముఖ్యత తెలిసిన సీఎం కేసీఆర్ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మెరుగైన విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకులాలు కార్పొరేట్ సంస్థ లకు దీటుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిందని వినోద్ కుమార్ తెలిపారు. ఇతర అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని ఆయన వివరించారు. యూ సి సి సి ఆధ్వర్యంలో ఈనెల 18న సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరుగనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వారు వినోద్ కుమార్ ను ఆహ్వానించారు. క్రిస్టియన్ ల స్మశాన వాటిక కోసం తెలంగాణ ప్రభుత్వం 68.32 ఎకరాల భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు, అందుకు సంపూర్ణ సహకారాన్ని అందించిన వినోద్ కుమార్ కు యూ సి సి సి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.