ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని, జనవరి 1వ తారీఖునుండి అన్ని క్యాన్సర్ సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంతి కాలం ప్రతీ నెల రూ.5000 చొప్పున వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకంద్వారా అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే తనకు బాధగా ఉంటోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చినమాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానే తప్ప తనకు ప్రతిపక్షాలు ఆపాదిస్తున్నట్టు వేరే ఉద్దేశాలు లేవని జగన్ అన్నారు. వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకంగురించి ప్రస్తావిస్తూ.. నేడు ఓగొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఎవ్వరూ ఇబ్బందులు పడబోరని హామీ ఇస్తున్నానని తెలిపారు. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన లక్ష్యమని జగన్ అభిప్రాయపడ్డారు.