వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగు తోనే ప్రారంభమౌతుందని ఎం.పీ సంతోష్ కుమార్ నిరూపించారని, గ్రీన్ ఛాలెంజ్ రూపంలో హరిత తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పొలిటికల్) అధర్ సిన్హా. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో మూడు మొక్కలు నాటిన అదర్ సిన్హా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాజా సదారాం, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ లను మొక్కలు నాటాల్సిందిగా కోరారు. తనను నామినేట్ చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. హరిత తెలంగాణ ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించటం చేయాలని అధర్ సిన్హా కోరారు. ఎం.పి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించటంతో పాటు, అన్ని వర్గాల వారినీ అందులో భాగస్వామ్యం అయ్యేలా చేసిందన్నారు. ఇదే స్ఫూర్తిని అందరూ కొనసాగించాలన్నారు.
