వరుసగా సంక్షేమ కార్యక్రమాల అమలు తో యావత్ భారతదేశం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీని రాష్ట్రం అంతా వర్తింపజేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా హాజరయ్యారు. ఏపీలో నాణ్యమైన బియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు, మంత్రులు జగన్‌కు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్తింపచేయాలని సీఎం ఆదేశాలను జారీచేశారు.
మరోవైపు ఇప్పటికే ఏపీలో ప్రతిపక్షాలు సన్నబియ్యం పంపిణీపై మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఎక్కడా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం లేదని అధికార పార్టీని టీడీపీ ప్రశ్నించింది. దీంతో జగన్ టీడీపీ చేస్తున్న విమర్శలకు ఈనిర్ణయం ధీటుగా సమాధానం చెప్పినట్లయింది.ప్రతిపక్షాల విమర్శలను ఒక్కొక్కటిగా సీఎం జగన్ తిప్పికొడుతున్నారు. సన్న బియ్యం పంపిణీ పై జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.