ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ విడుదల చేసిన పుస్తకాన్ని, బయటకు విడుదల చేస్తే తప్పకుండా ప్రజలు చంద్రబాబును ఛీ కొడతారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఆరు నెలల్లోనే ఇంత దుష్ప్రచారం చేస్తారా అని ప్రజలే బాబును దుమ్మెత్తిపోస్తారని అన్నారు. బాబు నేతృత్వంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని, వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిందని, ఈ దశలో పాలన పగ్గాలు చేపట్టిన జగన్ అన్ని వర్గాల్లో అభివృద్ధినినింపే నిర్ణయాలతో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి లా ముందుకు వెళ్తున్నారని అన్నారు. భారతదేశంలో బాగా పనిచేసే సీఎంల పేర్లను పరిశీలిస్తే మొదటి వరుసలో వైఎస్ జగన్ పేరు ఉంటుందన్నారు.
చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధం పుట్టుకొస్తుందని, ప్రజల్లో విష బీజాలు నింపేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నిస్తున్నారన్నారు. గత ఎన్నికలలో కేవలం 23 సీట్లు ఎందుకు వచ్చాయో విశ్లేషించుకోకుండా సీఎం వైఎస్ జగన్‌పై తప్పుడు ఆరోపణ చేస్తే మీ పార్టీ నిలబడుతుందా అని ప్రశ్నించారు.