తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సత్వరసేవలు అందించేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 107 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూలోనే ఇన్నిరకాల చట్టాలు అమల్లో ఉండటంతో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఏ చట్టం ద్వారా పరిశీలించి పరిష్కరించాలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్ట్(బీ)లో పేర్కొన్న భూ సమస్యలు చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఈ సమస్యలకు తోడు రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి ఏరులై పారుతున్నది. విసుగెత్తిన కొందరు భూ యజమానులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తుచేస్తున్నది. అవినీతికి ఆస్కారం లేని కొత్త చట్టం ద్వారా భూ లావాదేవీల్లో కోర్ బ్యాంకింగ్ విధానాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
భూ కాగితాల కోసం, ఇతర అవసరాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ పోవాలని, ఇందుకు అనుగుణంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. రెవెన్యూ చట్టాలన్నింటినీ అధ్యయనం చేసి, ఆయా చట్టాల్లో ఉన్న కీలక అంశాలతో సమగ్ర కొత్త చట్టాన్ని తీసుకురావడానికి అధికారులు కృషిచేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తర్వాత దాదాపు 50 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను రైతులకు అందించారు. అత్యంత పకడ్బందీగా పాస్‌బుక్కులను రూపొందించారు. వాటన్నింటినీ కంప్యూటరైజ్ చేశారు.