జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తిమోర్చా, ఆర్జేడీలు కూటమిగా ఏర్పడి బిజెపి పై పట్టు సాధించాలన్న ధీమాతో ఉన్నాయి . తొలి దశలో కాంగ్రెస్ జార్ఖండ్ చీఫ్ రామేశ్వర్, ఆరోగ్యశాఖ మంత్రి రామచంద్ర చంద్రవంశీలు బరిలో ఉన్నారు. ఆరు జిల్లాల్లోని మొత్తం 13 నియోజకవర్గాల్లో తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 37,83,055 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి దశలో మొత్తం 189 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 5 దశలలో జరిగే ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23 న తెలియనున్నాయి.
