ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. బాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ అని డీజీపీ వివరించారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులను తప్పుపట్టడం సహజమేనని ఆయన అన్నారు. మొన్న పల్నాడు ఇష్యూ చూశారు..పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారని సవాంగ్ గుర్తు చేశారు. మా విచారణలో వివాదాలు జరగవని తేలింది కాబట్టే..రాజధానిలో బాబు పర్యటనకు అనుమతి ఇచ్చామని..అలాగే ఎలాంటి సెక్షన్లు పెట్టలేదని డీజీపీ వెల్లడించారు.అయితే తాజాగా డీజీపీ సవాంగ్‌పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో పర్యటిస్తుండగా చంద్రబాబు బస్సుపై పోలీస్ లాఠీ విసిరారు.. ఎవరు వేశారో డీజీపీ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. బాబు కాన్వాయ్‌పై దాడికి సీఎం జగన్, డీజీపీ సవాంగ్ బాధ్యత వహించాలన్నారు. డీజీపీ ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందని .. అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే అన్నిచోట్లా దాడి జరగాలి కదా?, జగన్ పర్యటనలో కూడా మేము నిరసనలు తెలుపుతాం, వీటికి డీజీపీ అనుమతి ఇవ్వకపోతే.. మిమ్ములను వైసీపీ కార్యకర్తగా పరిగణిస్తామంటూ..అచ్చెన్నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నిజానికి నిన్న పోలీసులు సమర్థవంతంగా పని చేశారు. చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో రైతులు దాడులు చేయగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే రోప్‌లతో రైతులను నియంత్రించారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు ఎంతగా రెచ్చగొట్టినా..సంయమనం పాటించారు. అదే పోలీసులు బందోబస్తును పట్టించుకోకుంటే రైతుల చేతిలో చంద్రబాబుకు నిజంగానే బడిత పూజ జరిగేది. అలాగే బాబుపై జరిగిన దాడిలో మీడియాలో చెప్పులే కనిపించాయి కాని..పోలీస్ లాఠీలు ఎక్కడా కనపడలేదు.. పోలీసుల లాఠీలు రైతులు లాక్కుని బాబుపై వేసేందుకు ఆస్కారం లేదు.ఒక వేళ కర్రలు పడినా..అవి మామూలు కర్రలు అయి ఉంటాయి తప్ప..పోలీసుల లాఠీ కర్రలు అయి ఉండవు..అయినా కావాలనే టీడీపీ పోలీస్ లాఠీలు వేశారంటూ పోలీసులపై బురద జల్లుతోంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను పోలీసులు ఖండిస్తున్నారు. మరి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
