వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అగ్ర నటిగా కొనసాగుతుంది. అయితే కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీ వెబ్ సిరీస్‌లో నటించనుంది. మొదటిసారిగా వెబ్ సిరీస్‌లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్ రోల్ చేయనున్నది. సెప్టెంబర్‌లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్‌కు సీక్వెల్‌గా ఫ్యామిలీ మెన్ 2 వస్తోంది.
ఇందులో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేకు సామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చైతూ కామెంట్ చేశారు. కాగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు విశేషాదరణ దక్కింది. మనోజ్ బాజ్‌పేయీ, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ 10 ఎపిసోడ్‌లతో విజయవంతంగా కొనసాగింది. తాజాగా దీని సీక్వెల్‌లో సామ్ నటిస్తుండటంతో ఇది మొదటి సిరీస్‌ను మించిపోతుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో తన అభినయంతో ప్రేక్షకుల మనస్సులు దోచే సమంత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అభిమానులను ఎలా అలరించబోతుందో వేచి చూడాల్సిఉంది.