ఏపీలో విద్వేషపూర్వక రాజకీయాలకు టీడీపీ ఆజ్యం పోస్తుంది. అధికారానికి దూరంగా కావడంతో తట్టుకోలేకపోతున్న అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సీఎం జగన్ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ చిత్రపటాన్ని కొందరు వ్యక్తులు అవమానపరిచారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, ని కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వం గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈ గ్రామసచివాలయానికి రంగులు వేసి సీఎం జగన్ ఫోటోను చిత్రించారు. కాగా సీఎం జగన్ ముఖంపై కొందరు వ్యక్తులు చంద్రన్న కానుక సంచులు పెట్టి…అవి జారిపోకుండా ఉంచి కించపరిచారు. ఈ ఘటనపై గ్రామ సచివాలయం కార్యదర్శి శ్రీనివాసరావు పోలీసులకు బుధవారంనాడు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పొన్నూరు రూరల్ సీఐ రత్నస్వామి, ఎస్ఐ జయకుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన మేదరమెట్ల సుబ్బారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, రావెల సతీష్, బత్తిన వేణు, కిలారి హరికృష్ణ, షేక్ ఖాజావలి, పఠాన్ బుజ్జి తదితరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరంతా టీడీపీ సానుభూతిపరులని తెలుస్తోంది. సీఎం జగన్ చిత్రపటాన్ని అవమానించిన ఘటన తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఉద్దేశ్యపూర్వకంగా సీఎం జగన్ ఫోటోను అవమానించిన సదరు వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు కోరారు. గతంలో కూడా వైయస్ విగ్రహాలకు మసిపూసి అవమానించిన నీచ చరిత్ర టీడీపీ నేతలది. ఇప్పుడు వైయస్ జగన్పై ఉన్న ద్వేషంతోనే ఇలాంటి జుగుస్సాకరమైన పనులకు తెగబడుతున్నారు.
