ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి టాటా చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను రాజీనామాకు దారితీసిన అంశాలేవీ అని వంశీ లేఖ లో పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చాను. నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పాల్గొన్నాను. గత ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న కొందరు నేతలు, ఉద్యోగులు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అయినప్పటికీ నేను ఎన్నికల్లో గెలుపొందాను. ఎన్నికల తర్వాత అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు. అనుచరులపై కేసులు పెడుతున్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే నేను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను అని వల్లభనేని వంశీ లేఖలో రాసుకొచ్చారు. ఈ కారణలవల్లనే శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ లేఖలో పేర్కొన్నారు.