టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన ఈ రోజు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు ఇవాళ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేలకు ముద్దాడడం వంటి చేష్టలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 నెలల్లోనే రాజధానిలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ కౌలు రైతులకు న్యాయం చేస్తూ, దశలవారీగా రాజధాని నిర్మాణంపై ముందడుగు వేస్తున్న ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుపై ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, కన్నబాబులు మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబుది ముగిసిన అధ్యాయం అని అన్నారు. రాజధానిలో చంద్రబాబు కాన్వాయ్‌పై రైతుల పేరుతో వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారంటూ బాబు చేస్తున్న వ్యాఖ్యలను కొడాలి నాని తిప్పికొట్టారు. చంద్రబాబును అడ్డుకునే అవసరం వైసీపీకి లేదన్నారు. రైతులకు అన్యాయం చేసినందుకే ఇవాళ చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేశారని అన్నారు. రాజధానిలో మేం అడ్డుకోవాలనుకుంటే చంద్రబాబు ఒక్క అడుగు కూడా వేయలేరని కొడాలి నాని తేల్చి చెప్పారు. ఒక్క అమరావతిలోనే కాదు విజయవాడ రోడ్లపై తిరిగినా చంద్రబాబును ఎవరూ పట్టించుకునేవారే లేరని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇక మరో మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అమరావతిలో మొండి గోడలు తప్ప ఏమున్నాయని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల పేరుతో అన్యాయం చేసి రైతుల ఉసురు పోసుకున్నారని అందుకోసమే రైతుల చంద్రబాబుపై తిరగబడ్డారని చెప్పారు. బాబు సర్కార్ హయాంలో అమరావతిలో అన్యాయం జరిగిన వారిందరికీ న్యాయం చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. అలాగే మరో మంత్రి కన్నబాబు కూడా అమరావతిలో బాబు పర్యటనపై స్పందించారు. టీడీపీ రాజకీయ పార్టీ కాదు .. డ్రామా కంపెనీ అని కన్నబాబు దుయ్యబట్టారు. తనను ప్రజలు మరచిపోతారనుకొని..ఇలాంటి చవకబారు డ్రామాలు ఆడడం బాబుకు అలవాటే అని విమర్శించారు. మొన్న ఇసుక, ఇంగ్లీష్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజధాని పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. మొత్తంగా అమరావతిలో చంద్రబాబు పర్యటన ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.
