అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 27, గురువారం నాడు అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేయగా..తాజాగా మరో మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాని…అసలు ఐదేళ్లలొ ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టని చంద్రబాబుకు అమరావతిలో తిరిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర 30 వేలకు పైగా ఎకరాలు లాక్కున్న చంద్రబాబు.. వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రాజధానికి రావాలంటే ఒక్క మంచి రోడ్లు లేదని, బాబుకట్టించిన టెంపరరీ సెక్రటేరియట్ నారాయణ కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌లా ఉందని..ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్‌కు వస్తే కనీసం టాయిలెట్ కూడా లేదన్నారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ…ఐదేళ్ల పాటు ప్రజలను దారుణంగా వంచించిన చంద్రబాబు..ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళతారని మంత్రి పేర్నినాని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మొత్తంగా అమరావతి పర్యటన నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ మంత్రులు చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.