అమరావతిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప పర్యటనలో తిరుమల తిరుపతి విషయంలో తనను వ్యక్తిగతంగా విమర్శించిన కొడాలి నానిపై చంద్రబాబు తప్పుపట్టారు. దీంతో మరోసారి బాబుపై నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఒక సన్నాసి అని, ప్రజలు నేలకేసి కొట్టిన బుద్ధి రాలేదని నాని మండిపడ్డారు. రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, చంద్రబాబు కూడా వాటితో పాటే రాజధానిలో తిరుగుతారని నాని ఎద్దేవా చేశారు. అమరావతిలో నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్ళపొదలు తప్ప మరేమీ లేదని, అసలు రాజధానిలో ఏముందని చంద్రబాబు పర్యటిస్తారని మండిపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు ఉండేది రాజధానిలోనే కదా, మరి ఎక్కడినుంచో చంద్రమండలం నుంచి వచ్చినట్టు అమరావతిలో పర్యటిస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ నాని తీవ్రంగా దుయ్యబట్టారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్ర పోయేవరకు సొల్లు కబుర్లు చెప్పడమే చంద్రబాబుకు పని అని నాని వెటకారం ఆడారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పై సమీక్షలు, గ్రాఫిక్స్ రిలీజ్ చేయడం, మధ్యాహ్నం నుంచి పోలవరం పై సమీక్ష లో ఒక శాతమో, పావు శాతమో పని జరిగింది అని చెప్పడం తప్ప చంద్రబాబు ఇంకేది పట్టించుకోలేదని కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామను చంపించిన సన్నాసి అని, దివంగత ఎన్టీఆర్ మరణం తర్వాత సిబిఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదు అని మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు నాయుడుకి, ఆయన కొడుకు లోకేష్‌కి బుర్ర సరిగా పని చేయదు కాబట్టి ఐదు, పదివేలకు, రెండు పలావు పొట్లాలకు, పాతిక లీటర్ల డీజిల్ కు పనిచేసేవాళ్లను కాకుండా కాస్త బుర్ర పెట్టి పనిచేసేవాళ్లను పనిలో పెట్టుకుని ఓటమిపై రివ్యూ నిర్వహించుకోవాలని నాని హితవు పలికారు. జగన్ ఇంత చిన్నవాడైనా అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, ఇంత అనుభవం ఉండి కూడా మనం ఎందుకు సంకనాకి పోయాం అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు. తాము ఏమైనా అంటే బూతులు తిడుతున్నామంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నామని..ఉన్న మాటలు అంటే ఉలుకెందుకు అని నాని ప్రశ్నించారు. ఇక తమకు పోలవరం, అమరావతి మాత్రమే కాదు 13 జిల్లాలు కూడా ఎంతో ముఖ్యం అని మంత్రి కొడాలి నాని స్పష్ట చేశారు. అసలు చంద్రబాబు రాజధాని పర్యటనకు ప్రాధాన్యత లేదని..టీడీపీ బురద రాజకీయాలకు పరాకాష్ట అమరావతి పర్యటన అని మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. మొత్తంగా మరోసారి చంద్రబాబుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి.
