చివరి ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఇప్పుడిప్పుడే నెరవేరుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అహోరాత్రులు శ్రమించి ఇంజినీరింగ్ పాత్రలో నిర్మించిన కాళేశ్వరం జలాల ఫలాలు రైతులకు అందడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కండ్లలో అంతులేని ఆనందం కనిపిస్తోందని ఆయన చెప్పారు. మినిట్ టు మినిట్ సూర్యపేట జిల్లాకు కాళేశ్వరం నుండి పారుతున్న గోదావరి జలాలు ఎక్కడి దాకా చేరాయి అంటూ చేస్తున్న వాకబు లే ఇందుకు నిదర్శనం మని ఆయన అన్నారు.
బుధవారం ఉదయం సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం మాదారం పెద్దచెరువులో నీటినిలువలను ఆయన స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లతో కలిసి పరిశీలించారు. సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం వరకు కాళేశ్వరం జలాలు చేరే రోజు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి నుండి వెనుక బాటుకు గురైన సూర్యపేట జిల్లా రైతాంగంలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర తపన అని ఆయన కొనియాడారు.