భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం ఉదయం 9:28 నిమిషాలకు ఇస్రో PSLV-C47 ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ సక్సెస్ ఫుల్ గా నిర్దేశిత కక్ష్యలోకి 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 13 అమెరికా ఉపగ్రహాలతో పాటు , స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3 కూడా ఉంది. నెల్లూరు లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ సెంటర్ నుండి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో మరో చిరస్మరణీయమైన విజయం నమోదైంది.ప్రయోగాన్ని ప్రారంభించిన 27 నిమిషాల్లోనే ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ఈ విజయంతో ఇస్రో సైంటిస్ట్ లు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రకృతి విపత్తుల సమయంలో సేవలు అందించటానికి స్వదేశీ శాటిలైట్ కార్టోశాట్-3 ఉపయోగపడనుంది. ఉగ్రవాద శిబిరాల ఫొటోలను మరింత స్పష్టంగా తీయడంలోను ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. మరిన్ని దేశానికి అవసరమైన సేవలు అందించటంలో కార్టోశాట్-3 ఉపయోగపడనుంది. 1,625 కిలోల బరువున్న ఈ కార్టోశాట్-3 శాటిలైట్ ,ఐదు సంవత్సరాల పాటు సేవలందించనుంది. ఇస్రో ఈ ఉపగ్రహం తయారీకి కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.