భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరొక విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈరోజు ఉదయం పీఎస్ఎల్వీ- సీ 47 వాహక నౌక ను ప్రయోగించడం జరిగింది. 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాల తో పాటు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పీఎస్ఎల్వీ సంకేతాలను అందుకోనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. రహదారుల నెట్వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్-3 జీవితకాలం 5 సంవత్సరాలు. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ ప్రయోగంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. పీఎస్ఎల్వీ- సీ 47 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో చైర్మన్ శివన్ అతని బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇలాంటి మరెన్నో ప్రయోగాలతో రాష్ట్రానికి దేశానికి వన్నె తెచ్చేవిధంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు తెల్పారు.