ఆంధ్రప్రదేశ్ లోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకు మొదట విడతగా వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఆర్థిక సాయం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం… తాజాగా రెండో విడత కింద లబ్దిదారులను ఖరారు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం ప్రకటించారు. రెండో విడతలో మొత్తం 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా గుర్తించామని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 36 వేల 340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించామని ఆయన తెలిపారు. ఇందుకోసం 230 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కొత్త లబ్దిదారులు ఎంతమంది వస్తే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
