దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను ఎత్తివేసి విచారణ ప్రారంభించింది. ఇదే సరైన సమయంగా భావించి ఆర్కే పిటిషన్ దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం సంచలనం అయిన సంగతి అందరికీ తెలిసినదే. 2015లో టీడీపీ మహానాడు సమయంలో ఆనాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని కోరుతూ నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల లంచం ఇవ్వటానికి ప్రయత్నించినట్లు వీడియోలు హల్‌చల్ చేశాయి.
అదే సమయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు సైతం ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు వాయిస్ రికార్డులు బయట పడ్డాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తదనంతర పరిణామాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారాల్లో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ న్యాయపరంగా విచారణ కొనసాగుతూనే ఉంది.ఇదే కేసుకు సంబంధించి అప్పుడు సీఎంగా ఉన్న చ్రందబాబుపైనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే సుప్రీంలో కేసు దాఖలు చేశారు. అందులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఛార్జిషీట్‌లో 52సార్లు చ్రందబాబు పేరు ప్రస్తావించిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ల్లో మాత్రం చేర్చలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందంటూ ఆర్కే పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంలో సవాల్ చేశారు. ఆర్కే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులిచ్చింది.