ప్రతి ఆవాసానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పీఎంజీఎస్‌వై రోడ్ల ప్రతిపాదనల తయారీపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పీఎంజీఎస్‌వై మూడో దశ కింద కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 2,427 కిలో మీటర్ల రోడ్లు మంజూరు చేసిందని… అన్ని గ్రామీణ నియోజకవర్గాలకు ఈ రోడ్లను కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టే ఈ రోడ్ల ప్రతిపాదనల తయారీ పక్కాగా ఉండాలని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. పీఎంజీఎస్‌వై మార్గదర్శకాలను ప్రజాప్రతినిధులకు వివరించాలని, ఆ మేరకు ప్రతిపాదనలు ఉండేలా చూడాలని అన్నారు. పీఎంజీఎస్‌వై మార్గదర్శకాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదిక సమర్పించాలని సూచించారు. పీఎంజీఎస్‌వైలో మూడో దశలో ప్రతి నియోజకవర్గానికి 20 కిలో మీటర్ల వరకు రోడ్ల మంజూరు ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రోడ్ల ప్రతిపాదనల రూపకల్పనలో మారుమూల గ్రామాలకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగాల్లోని ఇంజనీర్ల సర్వీసు నిబంధనలు, పదోన్నతుల అంశంపై ఏర్పాటైన కమిటీ త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిటీ చైర్మన్ అయిన పీఆర్ ఈఎన్‌సీని మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, పీఎంజీఎస్‌వై చీఫ్ ఇంజనీర్ ఎం.రాజశేఖర్‌రెడ్డి, సీఈలు మృత్యుంజయం, రవీందర్ పలువురు ఎస్‌ఈలు సమావేశానికి హాజరయ్యారు.