ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు సన్నిహితుడైన ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరినే రంగంలోకి దింపింది. ఇప్పటికే సుజనా చౌదరి తన పని మొదలుపెట్టాడు. టీడీపీలో తనకున్న పరిచయాలతో కీలక నేతలను బీజేపీలోకి లాగేందుకు సుజనా ప్రయత్నాలు ఆరంభించాడు. కాగా తాజాగా ఢిల్లీలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సుజనాచౌదరి, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో సమావేశమవడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని సుజనాచౌదరి ఇంటికి లంచ్‌కు వచ్చిన జేపీ నడ్డాను అదే సమయంలో అక్కడకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజనా జేసీ దివాకర్ రెడ్డిని నడ్డాకు పరిచయం చేశారంట..ఈ ముగ్గురి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చ జరిగిందంట.. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని జేసీ నడ్డాకు వివరించారంట.. జగన్ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటుందని..జేసీ ప్రస్తావించారట. అనంతపురంలో తన బస్ ట్రావెల్స్‌పై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై సాగుతున్న కక్షసాధింపులను కూడా జేసీ నడ్డా దగ్గర చెప్పుకొచ్చాడంట..జేసీతో భేటీ అనంతరం మరొక గంట పాటు సుజనా, నడ్డా చర్చలు జరిపారంట..ఏపీలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఓ రోడ్ మ్యాప్‌ను తయారు చేయమని, నడ్డా సుజనాకు చెప్పారని సమాచారం. అలాగే సుజనా బీజేపీలో చేరబోయే టీడీపీ నేతల లిస్ట్ కూడా అందించినట్లు తెలుస్తోంది. సుజనాచౌదరితో ఆపరేషన్ టీడీపీ నడిపిస్తున్న బీజేపీ అధిష్టానం..ఈ మేరకు జేసీ దివాకర్ రెడ్డి లాంటి టీడీపీ సీనియర్ నేతల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నాడు. తన కొడుకు, తమ్ముడు ఓడిపోవడం, రాజకీయంగా అనంతపురంలో పలుకుబడి తగ్గడం, మరోవైపు దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ వెరసి..జేసీ దివాకర్ రెడ్డి తన కోసం కాకపోయినా..తన కొడుకు జేసీ పవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీవైపు చూస్తున్నాడని అనంత టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఢిల్లీలో జేపీ నడ్డాతో జేసీ దివాకర్ రెడ్డి భేటీ అవడం టీడీపీలో కలకలం రేపుతోంది.
