రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి పూర్తిస్థాయి నియంత్రణ తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 400 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక విక్రయాలు, రవాణా పూర్తి పారదర్శకంగా జరిగేలా రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంకా కొన్ని చోట్ల చేయాలిసి ఉన్నదని తెలిపారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్‌ను మంత్రి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తవ్వకాలను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక లారీల యజమానులతో మాట్లాడారు. ఇసుక రవాణా చేసే లారీల కు జీపీఎస్ తప్పని సరిగా అనుసంధానం చేసుకోని ఉండాలని జీపీఎస్ లేని లారీలను ఇసుక రవాణాకు అనుమతించవద్దని ఆదేశించారు. అనంతరం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
చెక్‌పోస్టులను ఇప్పటికే వంద వరుకు సిద్ధం చేశామని ప్రతి చెక్‌పోస్టులోనూ రెండు సీసీ కెమెరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపేలా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకుని రాబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రోజువారీ ఇసుక తవ్వకం దాదాపు 4 లక్షల టన్నులకు చేరిందని చెప్పారు. మరో నాలుగైదు రోజుల్లో ఇది 10 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. రోజువారీ సగటు వినియోగం 65 వేల టన్నులు ఉందని చెప్పారు. వచ్చే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఇసుకను డిపోలు, స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచే యోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లదించారు.
చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగిందని మంత్రి అన్నారు. అయిదేళ్ల కాలంలో ఇసుక ద్వారా చంద్రబాబు ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలను వెనకేసుకువచ్చారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తుంటే ఎల్లో మీడియాతో ప్రభుత్వంపై బురద చల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఇసుక కొరత అంటూ రాశారని, ఈ రోజు సమస్య పరిష్కారం కావడంతో అక్రమ రవాణా అంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని చెప్పారు. ఎలాంటి తప్పుడు వార్తలను ఎన్ని రాసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని జగన్ పాలనపై ప్రజకు నమ్మకం ఉన్నదని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు మేలు కలిగే విధంగా ఉన్నదని ప్రజలు గ్రహించారని మంత్రి రామచంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు.