అమరావతికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో నిర్మాణాల కొనసాగించాలని నిర్ణయించారు. సీఆర్డీఏ సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ప్రాధాన్యతల వారీగా నిర్మాణపనులు జరగనున్నాయి. అయితే, ప్రాజెక్టు ఖర్చు తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో ఆర్ధిక పరిస్థితి దృష్టి లో పెట్టుకుని నిర్మాణాలు చెయ్యాలి. అనవసర ఖర్చులు, వృధా ఖర్చులు చేయవద్దని సూచించారు. రైతులకు వీలైనంత త్వరగా ప్లాట్స్ కేటాయించాలని నిర్దేశించారు. సీఆర్డీఏ పరిధిలో ప్రాధాన్యత ప్రకారం పనులు చెయ్యాలి. అనవసర ఆర్భాటాలకు పోకుండా పనులు చెయ్యాలి. ఏ పనులు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిపైనే దృష్టి పెట్టాలి. అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని నిర్మాణ వేగంపుంజుకోనున్నదని రాజకీయ ప్రబుద్దులు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని నిర్మాణ పనుల్లో త్వరలో రివర్స్ టెండరింగ్ అమలు చేయనున్నారు. సీఆర్డీఏ పరిధిలో ఇంతవరకూ జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయన్నదానిపై సీఎం జగన్ ఆరా తీశారు. సీఆర్‌డీఏ పరిధిలో రోడ్ల డిజైన్ గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులుండకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్లు తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్ధితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై సీఎం ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్‌స్కేపింగ్ చేసి సుందరీకరించాలని సూచించారు.రాజధాని నిర్మాణ విషయమై సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలకు ప్రజలు సర్వతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.