2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రూ. 50 లక్షలతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేయబోయి నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కేసులో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ..డోంట్ బాదర్..వియ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ కేసులో బుక్కైపోయాడు. ఫోన్ కాల్‌లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్‌లు కూడా నిర్థారించాయి. అయితే ఓటుకు నోటు కేసును చంద్రబాబు తన జిత్తులమారి తెలివితేటలతో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించాడు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంటూ తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేందుకు ప్రయత్నించాడు. ఓటుకు నోటు కేసుతో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో కేంద్రం రంగంలోకి దిగింది. క్రమంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కేసు పెండింగ్‌లో పడింది. తాజాగా ఓటుకు నోటు కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. కేసును 2019 ఫిబ్రవరిలో విచారిస్తామంటూ 2018 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు కేసు విచారణకు రాలేదని, శీఘ్రగతిన విచారించాలని అభ్యర్థించారు. ఆళ్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు పాత్రపై అధికారులు దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ 2016 ఆగస్టు 8న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని అదే ఏడాది ఆగస్టు 29న ఏసీబీని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు 2016 సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2017 మార్చి 6న ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇది వినాల్సిన కేసని.. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తామని పేర్కొంటూ ఆ సమయంలో నోటీసులు జారీ చేసింది. 2017 మార్చి 6న సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై తగినంత ఆసక్తి చూపడంలేదని, ప్రతివాదులు పలుకుబడి కలిగిన వారైనందున ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేయవచ్చని పిటిషనర్ తొలిసారి శీఘ్ర విచారణ కోరిన సమయంలో నివేదించారు. వీటితోపాటు మరో కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా రెండోసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలుచేశారు. 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు కేసు లిస్ట్ కాలేదని… పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు రిజిస్ట్రీలో విచారించినా ఫలితం లేదన్నారు. దీన్ని విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడానికి కారణాలు తెలియడం లేదని నివేదించారు. సో..ఆళ్ల పిటీషన్‌పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఇప్పటికే అక్రమాస్థుల కేసులో లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్‌పై ఉన్న స్టేను ఏసీబీ కోర్టు కొట్టేసింది. విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఓటుకు నోటు కేసులో ఆళ్ల వేసిన ఎర్లీ హియరింగ్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు త్వరతిగతిన ఈ కేసు విచారణ జరిపితే చంద్రబాబు చిక్కుల్లో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా అక్రమాస్థుల కేసుతో పాటు, దాదాపుగా మూతబడిందనుకున్న ఓటుకు కోట్లు కేసు మళ్లీ రీఓపెన్ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనలో పడ్డారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు మెడకు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.