యాదాద్రి పంచనారసింహక్షేత్రం మహాద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ప్రధానాలయ ముఖమండపంలో కీలక పనులు ముగింపుదశకు చేరుకున్నాయి. గర్భాలయ ప్రధాన ద్వారం, ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠంతోపాటు ఇప్పటికే పూర్తయిన సప్తగోపురాలపై ఏర్పాటుచేసిన 58 కలశాలకు పసిడి సొబగులను తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా వీటిపై రాగి పలకలను అమర్చే పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం వీటికి బంగారు తాపడంచేస్తారు. గర్భగుడికి ఏర్పాటుచేసిన ప్రధాన ద్వారానికి కూడా రాగిపలకలపై బంగారు తాపడంచేసే పనులు చెన్నైలో జరుగుతున్నాయి. ఇక గర్భాలయ గోడపై పంచనారసింహ శిల్పాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహాలకు కూడా రాగి ఫలకాలను బిగించే పనులు జరుగుతున్నాయి. గర్భాలయం పైభాగాన శ్రీవారి తిరునామాలు, శంఖుచక్రాల ఏర్పాటు పూర్తయింది. భక్తులు పశ్చిమగోపురం గుండా బయటకు వెళ్లడానికి వీలుగా రెయిలింగ్ పనులు పూర్తవుతున్నాయి. ఆంజనేయస్వామి ఆల యం దగ్గర క్లాడింగ్ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు వీవీఐపీలు కూర్చొనే రాతిబెంచీలకు ఇరుపక్కలా ఏనుగుల ప్రతిమలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రవేశద్వా రం దగ్గర కూడా రెండువైపులా ఐరావత శిల్పాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ దారిలో మొత్తం 36 ఏనుగు ప్రతిమలను చెక్కడానికి టెండర్లు పిలిచారు. విమాన గోపురం బయట ప్రథమ ప్రాకారం పనులు మొత్తం పూర్తయ్యాయి. ఆండాళ్ అమ్మవారి సన్నిధి పక్కన శయనోత్సవ మండపం సివిల్ పనులు శ్లాబ్ వరకు అయిపోయాయి. వంటశాల రామానుజకూటమిలో మిగిలిపోయిన పనులు పూర్తిచేస్తున్నారు. మాడవీధుల్లో ఫ్లోరింగ్‌ను కృష్ణశిలలతో చేయనున్నారు. శివాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వచ్చి తుదిదశ పనుల తీరుతెన్నులను పరిశీలిస్తారని వైటీడీఏ అధికారులకు సమాచారం రావడంతో అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు ఫిబ్రవరిలో తలపెట్టిన సుదర్శన నారసింహ మహాయాగ పనులను కూడా సీఎం పరిశీలించే అవకాశం ఉన్నదని తెలిపారు. తుది దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ మరో శ్రీకృష్ణదేవరాయలుగా మారి ఎంతో వ్యయప్రయాసలకోర్చి చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని దీక్షతో పూర్తిచేస్తాం. ఇందుకోసం అహోరాత్రులు శ్రమిస్తున్నాం. ఆర్కిటెక్టు ఆనందసాయి సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుని వారిస్తున్న స్ఫూర్తితో పనులను వేగవంతం చేశామని, నెలరోజుల్లో ఆలయ నిర్మాణ పనులను పూర్తిచేస్తామని ప్రధాన స్థపతి డాక్టర్ ఆనందాచార్యుల వేలు తెలిపారు.
