ఆంధ్ర ప్రదేశ్ లో వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నవరత్నాల అమలు లో భాగంగా మద్యం పై ఆంక్షలు విధించిన విషయం తెలిసినదే. ఈ సంచలనాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల లోపే మద్యం విక్రయాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎపిలో బార్ లైసెన్స్ లను రద్దు చేయడం, మద్యం ధరలు పెంచడం వంటి నిర్ణయాల నేపద్యంలో హైకోర్టును ఆశ్రయించాలని బార్ ల యజమానులు భావిస్తున్నారు.ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగాను, సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగాను ఉందని వారు అంటున్నారు. తమకు 2022 వరకు బార్ లైసెన్స్లు ఉన్నాయని, ఇప్పటికిప్పుడు రద్దు చేయడం అంటే తమకు ఆర్దికంగా చాలా నష్టం అవుతుందని వారు అంటున్నారు. బార్లకోసం మౌలిక వసతులు, ఇతర సదుపాయాల నిమిత్తం చాలా వ్యయం చేశామని, ఇప్పుడు సడన్ గా లైసెన్స్ రద్దు చేశామని అంటే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని వారు అంటున్నారు. అందువల్ల తమకు హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందని వారు చెబతున్నారు.