హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాహనాల కోసం ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ పైనుంచి పల్టీలు కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా అధిక వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో కారు తునా తునకలు అవ్వగా, చెట్లు విరిగి పడ్డాయి. మరోవైపు ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గత వారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
