తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ..
సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని చంపాపేటలో అద్దెగా ఉంటున్న ఇంట్లో శుక్రవారం ఆయన గుండెపోటుతో కుప్పకూలారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ప్రస్తుత భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల. ఆయనకు భార్య యాదమ్మ(రామంజమ్మ),కుమారులు రాజశేఖర్ రెడ్డి,రామ్మోహాన్ రెడ్డి,కుమార్తెలు రాజమణి,భారతమ్మ ఉన్నారు.
యాదగిరి రెడ్డి 1931 ఫిబ్రవరి 5న ఒక సాధారణ కుటుంబంలో జన్మించి తన 15ఏటానే ప్రజాపోరాటంలో పాల్గొన్నారు. సీపీఐ తరపున ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కానీ సొంత ఇల్లు,ఆస్తులు లేకుండా చాలా సాధారణ జీవితాన్ని గడిపారు ఆయన.