తెలంగాణ శాసనసభ షెడ్యూల్ కులాల అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఈరోజు శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో జరిగింది. కమిటీ అధ్యక్షుడు, చెవేళ్ళ శాసనసభ్యుడు శ్రీ కాలే యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….గ్రామాలు, బస్థీలలో అత్యంత పేదరికంలో ఉన్నవారు షెడ్యుల్ కులాల వారే. ఉపాధి అవకాశాలు లేక, భూములు లేక అత్యంత పేదరికంలో మగ్గుతున్న షెడ్యుల్ కులాల వారి సంక్షేమం కోసం పనిచేయాలి. వారి ప్రాధమిక అవసరాలను తీర్చాలి. ఈ కమిటీ పథకాలను అమలు చేయక పోయినా అంతకు మించిన బాధ్యతలు కలిగినది. షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిలోని లోపాలను, లొసుగులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడం, అదేవిధంగా సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడం ఈ కమిటీ బాధ్యత. తద్వారా ప్రభుత్వం ఆయా పథకాలను మరింత సమర్ధవంతంగా, పారదర్శకంగా అమలుచేయగలుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యుల్ కులాల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తుంది. గత ప్రభుత్వాల హయంలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 80 శాతంకు పెంచింది. తద్వారా లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 అయితే 100 శాతం, ఆపై 80 శాతం సబ్సిడీని లబ్ధిదారులకు నేరుగా అందిస్తుందన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందని అయితే దళారీల జోక్యం ఎక్కువగా ఉందని శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ సి కార్పొరేషన్ చుట్టూ పైరవి కారులు ఎక్కువగా తిరుగుతుంటారని, కొంతమంది తీసుకున్న వారే మళ్ళీ రుణాలను తీసుకుంటున్నారని అన్నారు. అయితే కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే ఇవన్నీ బయట పడతాయన్నారు. కమిటీ సభ్యులుగా నిజమైన పేద వర్గాలను సబ్సిడీలు అందే విదంగా చూడాలని అన్నారు.
చాలా మంది పేదలు కార్పొరేషన్ ల చుట్టూ తిరుగుతుంటారని, వారికి రుణాలు లభించేలా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయి లో పరిశీలన జరిపితే నిజమైన పేదలకు అవకాశాలు చాలా వరకు దక్కుతాయన్నారు.. జిల్లా స్థాయి లో జరిగే సమావేశాల్లో కమిటీ సభ్యులు పాల్గొని బాధ్యత గా వ్యవహరించితే అందరికి ఫలాలు అందుతాయని చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇంత పెద్ద స్థాయి లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించడం లేదని అది కె సి ఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కమిటీ సభ్యులు దుర్గం చిన్నయ్య, మెతుకు ఆనంద్ , రవిశంకర్ సుంకే, నారదాసు లక్ష్మణ్ రావు యజ్ఞ మల్లేష్, రాజేశ్వర్ రావు మరియు శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.