నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు..జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంచిని బయటకు తీయించగా అందులో మహిళ మృతదేహం ఉంది. మహిళ నైటీ ధరించి తీవ్రగాయాలతో ఉంది. హత్య చేసి సంచిలో ఉంచి బూట్ల లేస్‌లతో కట్టి కాలువలో పడవేశారు.
మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె వయస్సు 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోలీస్ జాగిలాలు పరిసర ప్రాంతాల్లో తిరిగాయి. హత్య జరిగి మూడురోజులై ఉంటుందని, మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులను విచారించారు. వారినుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో బయటి ప్రాంతంలో హత్య చేసి వాహనంలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.