బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. చంద్రబాబు వైఖరితో విసుగుచెంది, టీడీపీని వీడినట్లు వంశీ అన్నారు. సీఎం జగన్ పరిపాలన తననెంతో ఆకట్టుకుందని వంశీ, ప్రజారంజక పాలన అందిస్తున్నవైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. ఈ భేటీపై దుట్టారామచంద్రరావు స్పందించారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా వంశీతో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. వైసీపీలో వంశీ చేరిక నేపథ్యంలో తనను కలుసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా..దానికి కట్టుబడి పని చేయడమే తన ధర్మమని దుట్టా తెలిపారు. కాగా దుట్టా నివాసంలో వైయస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వంశీ పూలమాలు వేసి, నివాళులు అర్పించడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేత దుట్టాను కలవడానికి వచ్చిన వంశీకి మండలంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. మొత్తంగా త్వరలోనే వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చిరకాల ప్రత్యర్థి అయిన దుట్టా రామచంద్రరావును కలవడం బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.