విజయవాడలో ఇసుకదీక్ష రోజునే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇసుకదీక్ష జరుగుతున్న సమయంలో టీడీపీ కీలక నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రజారంజకపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించి, చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో వంశీ, అవినాష్‌లపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు..వంశీ ఆస్తులు కాపాడుకోవడానికి వైసీపీలో చేరాడని లోకేష్ ఆరోపిస్తే..దేవినేని అవినాష్ కేవలం డబ్బుల కోసమే పార్టీ మారాడని టీడీపీ నేతలు ఆరోపించారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో స్పందించారు..నవంబర్ 21 , గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ..సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆయనపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని అవినాష్ తెలిపారు. తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీలో చేరడానికి తనకు సహకరించిన పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపిన అవినాష్… తూర్పు నియోజకవర్గ ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతానన్నారు. ఈ సందర్భంగా డబ్బు కోసమే పార్టీ మారినట్లు తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై అవినాష్ ఘాటుగా స్పందించారు. కార్యకర్తల అభిమానాన్ని సంపాదించానే తప్ప ఏనాడు డబ్బు సంపాదించలేదని స్పష్టం చేశారు. గుడివాడలొ కొడాలి నానికి వ్యతిరేకంగా పార్టీలో ఎవరూ పోటీ చేయడానికి ధైర్యం చేయకపోతే..తన నియోజకవర్గం కాకపోయినా..కేవలం చంద్రబాబు చెప్పాడు కాబట్టే..పోటీ చేసి, రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయానే కాని.. పార్టీ నాకు ఒక్కరూపాయి ఇచ్చింది లేదంటూ అవినాష్ మండిపడ్డారు. టీడీపీ నేను ఉపయోగపడ్డాను. కానీ ఆ పార్టీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. టీడీపీలో ఉండి నేను భూకబ్జాలు చేయలేదు. నా మీద ఎటువంటి నేర ఆరోపణ లేదు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ దేవినేని అవినాష్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. అవినాష్ విమర్శలపై ఇప్పుడు టీడీపీలో చర్చజరుగుతోంది. బోండా ఉమ, దేవినేని ఉమ వంటి నేతలను ఉద్దేశించే టీడీపీలో ఉండి కబ్జాలు చేయలేదంటూ విమర్శలు చేశాడని..తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మొత్తంగా టీడీపీ నేతల విమర్శలపై దేవినేని అవినాష్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో కలకలం రేపుతున్నాయి.
