తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై తొమ్మిది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది నిరవధికంగా సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. అయితే నిన్న బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తోన్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్టీసీ యజమాన్యం, ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీ సిబ్బందిని భేషరత్ గా విధుల్లోకి తీసుకోవాలని విన్నవించుకుంది.
మరి సమ్మెపై మొదటి నుండి మెట్టు దిగని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై యావత్తు తెలంగాణ సమాజం తీవ్ర ఆసక్తితో ఉన్నది. ఆర్టీసీ సమ్మె విరమణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.
ఈ సమీక్షా సమావేశంలో భేషరత్ గా విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్ పై కాసింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమ్మె చేయడం.. సమ్మె విరమించుకోవడం.. విధుల్లోకి ఎలా చేర్చుకోవాలో వాళ్లే చెబితే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆర్టీసీ సిబ్బందిని ఒకవేళ విధుల్లోకి తీసుకుంటే కచ్చితంగా షరతులు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నట్లు టాక్. అయితే ఈ రోజు మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.