తెలంగాణ రాష్ట్రంలో గత నలబై ఎనిమిది రోజులుగా చేస్తోన్న ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు నిన్న బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి విదితమే. ఎలాంటి భేషరతుల్లేకుండా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జాక్ ఆర్టీసీ యజమాన్యాన్ని,ప్రభుత్వాన్ని కోరింది.
అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ కీలకమైన సమీక్షలో హైకోర్టు తీర్పులో ఏ అంశాలు ఉన్నాయి..?.జేఏసీ ప్రతిపాదనలు ఏమిటీ?.. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా..?. వద్దా..? . తీసుకుంటే ఎలాంటి షరతులు ఉండాలి ..?. ఇలా పలు అంశాల గురించి చర్చించనున్నారు అని సమాచారం. ఈ కీలకమైన సమీక్ష సమావేశానికి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ,సంబంధిత శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు హాజరు కానున్నారు.