ఉపాధికోసం గుజరాత్‌కు వెళ్లే మత్స్యకారుల కుటుంబాలను చూస్తే తనకు బాధేసిందని తెలిపారు. వేటకోసం వెళ్లి ప్రమాదాల్లో మరణించే గంగపుత్రుల కన్నీళ్లు తుడవాలని ఆరోజు పడయాత్రలోనే అనుకున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ సమయంలో గతప్రభుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10వేలకు పెంచడంతోపాటుగా వీలైనంత తొందరగా అందేలా చూస్తామన్నారు. డీజీల్ సబ్సిడీని 50 శాతం పెంచి ఇచ్చే రూ. 9ని, ఆయిల్ కొట్టించుకునే సమయంలోనే జమయ్యేలా ఈరోజునుంచే అమలు జరుగుతుందన్నారు. దారిపొడవునా ఫిషింగ్ జెట్టీలు కావాలని పాదయాత్రలో గంగపుత్రులు విజ్ఞప్తి చేశారని, వారి కోరికమేరకు ప్రారంభిస్తున్నామని సగర్వంగా చెబుతున్నానన్నారు.
అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్న ప్రభుత్వం మీద బురదజల్లాలని పనిగా పెట్టుకున్న ప్రతిపక్షంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 790 మంది మత్స్యకారుల పిల్లలు గ్రామ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు సాధించారని, ఇంగ్లిష్ మీడియంపై రాద్ధాంతం చేసే పత్రికాధిపతుల పిల్లలు ఏమీడియంలో చదువుతున్నారో ప్రశ్నించాలని సూచించారు. మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివి టైలు కట్టుకుని ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లుగా కారుల్లో తిరుగుతుంటే చూడాలన్నదే తనకోరక అని సీఎం వివరించారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడొద్దా అని ప్రశ్నించారు. ఎవరెన్ని అనుకున్నా తాను చేయాలన్నది ప్రజలకోసం చేస్తానన్నారు.